Saturday, April 24, 2010

చిన్నప్పుడు ఎప్పుడో వచ్చిన ఐడియా ఇది . .

చిన్నప్పుడు ఒక ఆదివారం రోజు వచ్చింది ఈ ఆలోచన. . .
ఆ ఆలోచన మొన్న చాలా స్ట్రాంగ్ గా అనిపించింది.
ఆ గొప్ప ఆలోచన ఏమిటంటే . . .
మనం వెళ్ళే రోడ్ అంతటా టాప్ వేస్తె ఎలా ఉంటుంది అని. . .
అలా ఒక రూఫ్ లాగా వేసుకుంటే ఎండా నుంచి, వాన నుంచి, తప్పించుకోవచ్చు. అప్పుడు ఎండా కాలంలో స్కార్ఫ్ లు, వానా కాలంలో రెయిన్ కోట్ లు అవసరం లేకుండా ఉంటుంది కదా.
ఇలాంటిదే మరో ఆలోచన ఏమిటంటే ఇంట్లో ఎసి కి బదులుగా మనం వేసుకునే డ్రెస్ లే ఎండాకాలంలో చల్లగా. . . చలికాలంలో వెచ్చగా ఉండేవి మార్కెట్ లోకి వస్తే ఎంత బాగుంటుందో కదా. . .
ఈ రెండు ఆలోచనలే కాదు ఇలాంటివే బోలెడు వస్తుంటాయి.
మీ బుర్రల్లో కూడా ఇటువంటి ఆలోచనలు ఏమైనా ఉంటె. . . పంచుకోండి. . .
సరదాగా ఉంటుంది కదా.

Tuesday, April 20, 2010

ఎన్ని ఆటలో. . . చిన్ని గుండెలో

చిన్నప్పుడు ఆడుకున్న ఆటలన్నీ గుర్తుకొచ్చాయి మొన్న ఒక సందర్భంలో . . .
ఆఫీసు లో అందరం కలిసి కూర్చుని మాట్లాడుకుంటుంటే. . . ఒక సారి మధురమైన బాల్య జ్ఞాపకాలలోకి వెళ్లి వచ్చేసాము.
ముఖ్యంగా చిన్నప్పటి ఆటలు. . .
కోతి కొమ్మచ్చి, ఇసుకలో పుల్ల దాచి పెట్టి దాన్ని రెండు చేతులతో మూసి (పేరు గుర్తులేదు) ఎదురుగా ఉన్న వాళ్ళని ఆ పుల్ల ఎక్కడ దాచామో చెప్పమని అడగడం. . , చెమ్మ చెక్కలాట, అచ్చెన గిల్లలు, వామన గుంటలు, బతకమ్మ ఆట, వంగుడు దూకుళ్ళు, చింత పిక్కల ఆట, ఎండా వాన, దొంగ పోలీసు, మా తాత ఉత్తరం ఎక్కడో పోయింది అంటూ. . ., గద్దొచ్చే కోడి పిల్ల. . . అంటూ ఇంకో ఆట, నాలుగు స్తంభాలాట, టేక్కలే (దొంగ అయిన వాళ్ళు అంటుకోకుండా కింద కూర్చుండి పోవాలి ), కుంటుడు, బొమ్మలాట, పచ్చీస్, అష్ట చెమ్మ, . . . ఇలా ఇంకా ప్రస్తుతానికి గుర్తుకి రాని ఎన్నో ఆటలు ఆదేవాల్లము, అవి గుర్తుకి వచ్చినప్పుడు మనసుకి ఎంతో హాయినిచ్చినా. . . ఇప్పటి పిల్లలకి ఇవన్నీ లేవు కదా అని ఒకింత బాధగా కూడా అనిపించింది. . .
ఎందుకంటే అవి ఆడేటప్పుడు ఉండే మజానే వేరు కదా. . .

Sunday, April 18, 2010

గుబ్బకాయలు

గుబ్బ కాయలు . . . వీటినే సీమ చింతకాయలు అని కూడా అంటారు.
చిన్నప్పటి జ్ఞాపకంగా మిగిలిపోకుండా ఉండేదుకు. . . రోడ్ మీద తోపుడు బండ్లలో పెట్టి అమ్ముతున్నారు బాగానే ఉంది. సంతోషంగా అనిపించింది కూడా. . .
గుబ్బకాయలతో పాటుగా చింత చిగురు కూడా కుప్పపోసి పెట్టారు. . .
అది చూసి ఆహా ఇవ్వాళ రోడ్ చూసేందుకు ఎంత బాగుందో అనుకున్నాను మనసులో. . .
అంతటితో ఆగిపోతే అది మనసని ఎందుకు అనిపించుకుంటుంది. . .
గుబ్బ కాయలు తినాలనిపించింది . . . వెంటనే ఒక పక్కన ఆగి ఆ తోపుడు బడని దగ్గరకు వెళ్లి. . . గుబ్బకాయలను చూపిస్తూ ఎంత బాబూ అన్నాను. అతను చెప్పిన రేట్ విన్నాక. . . హా అని నోరు తెరుచుకుని ఉండిపోయాను కాసేపు.
ఆ తరువాత తేరుకుని . . .
బలంగా వాటిని తినాలన్నా కోరికని నొక్కి పెట్టాలనుకున్నాను. . . ఎందుకంటే అతను పావు కిలో ౪౫ (నలభై ఐదు ) రూపాయలు అనగానే. . . సెకండ్ లో ఒకటో వంతు గుండె ఆగిపోయింది కాబట్టి. . .
ఆ సెకండ్ లోనే చిన్నప్పుడు ఆడుకుంటూ గుబ్బకాయల్ని ఏరుకుని తిన్నానని. అలా తిని. . . మిగతావి గాల్లోకి విసురుతూ. . . పక్క వాళ్ళ పై విసురుతూ తిరిగిన రోజులు గుర్తుకొచ్చాయి. . . అచ్చం సునామీలాగా చుట్టుముట్టాయి ఆ జ్ఞాపకాలు.
కానీ ఏమి చేస్తాం పొట్ట చేత్తో పట్టుకుని పట్టణానికి వచ్చాం కదా నలభై ఐదు ఏమి ఖర్మ. . . ఎనభై ఐదు అన్నా కొనుక్కోవాలి తినాలి తప్పదు. అది కూడా వాటి రుచి తెలుసు కాబట్టి ఆ కోరిక. . .
అదే సిటీలలోనే పుట్టిన పిల్లలకి ఐతే ఆ బాదే లేదు. . .
ఎందుకంటే వాటిని కొనాల్సిన అవసరమే లేదు. . .
కాస్తో కూస్తో పల్లె టచ్ ఉంటే తప్ప వాటి పేరు కూడా తెలియదు కాబట్టి.
కొనాల్సిన అవసరం రాదు. . . ఆ రేట్ చూసి గుండె దడా రాదు.
చివరకి కొన్నాను. బేరమాడి ఇరవై ఐదు రూపాయలకి కొన్నాను. ఆ పక్కనే ఇంకో కుప్ప చింత చిగురు కనిపించింది కాని. . . దాని రేటు అడిగితె చటాకు తొంభై అంటాడేమో అని.
మనసుని, నోటిని రెండిటిని కట్టుకుని వచ్చాను.
ఇదీ ఇవ్వాల్టి గుబ్బకాయ అదేనండీ సీమ చింతకాయ తెచ్చిన చింత.

గుబ్బకాయ

గుబ్బకాయ
ఇవి చాలా ఖరీదు గురూ. . .

వామన గుంటలు

వామన గుంటలు
ఇందులో గవ్వలు పెట్టారు కానీ మేమయితే చింతగింజలతో ఆడేవాళ్లం