ఉత్థాన పతనాలలో మీడియా
- రాజ్‌దీప్ సర్దేశాయ్
ఒక ముఖ్యమంత్రి రాజీనామా చేశారు; ఒక కేంద్ర మంత్రి వైదొలిగారు... అవునూ, ఒకే ఒక సంవత్సరంలో అనేక 'విజయాల'ను సాధించినట్టు భారతీయ మీడియా సగర్వంగా చివరిసారి చెప్పుకున్నది ఎప్పుడు? రాజీపడని 'న్యూస్ జర్నలిజం'కు మళ్ళీ మంచి రోజులు వచ్చాయని ఆనందపడుతుండగానే నీరా రాడియా టేపులు జర్నలిజంను ఒక కొత్త సుడిలోకి నెట్టివేశాయి. శక్తిమంతులై న రాజకీయ వేత్తల బండారాన్ని నిర్భయంగా బయటపెడుతున్నందుకు రెండు నెలల క్రితం మీడియాకు ప్రశంసలు, అభినందనలు వెల్లువెత్తాయి.
ఆ మెచ్చుకోలు ముగిసిపోయింది. ఇప్పుడు పాత్రికేయులపై పరుష వాక్కులతో దాడి జరుగుతోంది. అధికారంలో ఉన్నవారితో కుమ్మక్కయ్యారని, వారూ వీరు కలిసి తమ తమ స్వప్రయోజనాలను సాధించుకొంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఆ ప్రశంసలకు, ఈ తెగడ్తలకు మధ్యలో ఎక్కడో ఒకచోట సత్యం ఉండి ఉంటుంది. ఏతావాతా చెప్పవల్సిందేమిటంటే నిష్క్రమించిన 2010 భారతీయ మీడియాకు దాదాపుగా డికెన్సియన్ సంవత్స రం! ఆ ఆంగ్ల మహారచయిత అన్నట్టు 'అవి బహు మంచి రోజులే కాదు, బహుశా మహా చెడ్డ రోజులు కూడా' సుమా!
ఒక విధంగా భారతీయ మీడియా ఉత్థాన పతనాలు అనివా ర్యం. ఇరవయో ఒకటి శతాబ్ది మొదటి దశాబ్దంలో భారతీయ మీడి యా మహా వేగంగానే కాదు, బహుముఖంగా విస్తరించింది. 2000 సంవత్సరంలో ప్రభుత్వం కేవలం ఒకే ఒక్క న్యూస్ చానెల్‌కి అనుమతినిచ్చింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా 500కి పైగా చానెల్స్ ఉన్నా యి. వీటిలో మూడో వంతు న్యూస్ చానెల్స్!
వందకు పైగా చానెల్స్ ప్రభుత్వ అనుమతి కోసం ఎదురు చూస్తున్నాయి. వీటికి తోడు ప్రతి రోజూ దేశ వ్యాప్తంగా అమ్ముడుపోయే దినపత్రికల ప్రతుల సంఖ్య పది కోట్లకు పైమాటే. ఇంటర్నెట్‌ను నిత్యం వినియోగించుకొనే భారతీయుల సంఖ్య కనీసం 80 లక్షలు. వార్తల పట్ల అంతులేని ఆసక్తితో, వార్తలే ఆలంబనగా ముందుకు సాగుతున్న సమాజం మనది. పఠనం, వీక్షణం ఇంత బృహత్తర స్థాయిలో ఉన్నప్పుడు మీడియా మన జీవితాలలో నిర్వహించే పాత్రను సాదా సీదా విశేషణాలతో మాత్రమే ఎలా చెప్పగలం?
పక్షం రోజుల క్రితం అహ్మదాబాద్‌లో ఒక న్యూస్ సెమినార్‌లో అసహనానికి లోనైన శ్రోత ఒకరు నన్నిలా ప్రశ్నించారు: 'మీడియా వృత్తి నిపుణులు తమకు తాము దేవుడిగా భావించుకుంటున్నారా?' అవినీతిని అరికట్టడం నుంచి ఉగ్రవాద నిర్మూలన వరకు జాతి ఎదుర్కొంటున్న సమస్యలన్నిటినీ మీడియా పరిష్కరించాలని వార్తల వినియోగదారులు కోరుతున్నారు.
మీడియా ప్రతినిధులు మరింత వినయంగా ఉండాలని, వార్తా నివేదనలో పాత్రికేయుల సొంత అభిప్రాయాలు జొరబడకూడదని, కొత్తగా, సుళువుగా సమకూరుతున్న 'ప్రముఖ వ్యక్తి' హోదా తుళుకు బెళుకులకు జర్నలిస్టులు బందీగా ఉండిపోకూడదని డిమాండ్ చేస్తుందీ వార్తల వినియోగదారులే. జర్నలిస్టు అనే వ్యక్తి ఇంతకూ ప్రజల కొత్త భగవంతుడా లేక సంఖ్యానేక వార్తల వినియోగదారులకు గుర్తు తెలియని బాని సా? కొత్త తరం మీడియా వృత్తి నిపుణుల ముందున్న సంక్లిష్ట ప్రశ్న ఇది.
ప్రతి రాత్రి న్యూస్ యాంకర్లు న్యాయమూర్తి, న్యాయ నిర్ణయ సంఘం, శిక్షను అమలుపరిచే అధికారిగాను వ్యవహరించడం సాధారణమైపోయింది. సంఘటనల, పరిణామాల 'తటస్థ', 'అనాసక్త' పరిశీలకులుగా ఉండడం నుంచి మనకు మనమే 'జాతి' తరఫు న మాట్లాడే హక్కును పొందినట్లుగా అతిశయంతో వ్యవహరిస్తు న్నాం. భిన్నాభిప్రాయాలు కలవారు ఉన్నారన్న వాస్తవాన్ని విస్మరిస్తున్నాం. న్యూస్ టెలివిజన్ గురించి చాట్ షోల గురువు ల్యారీ కింగ్ ఇలా వ్యాఖ్యానించారు:
'ఇప్పుడు మీరు మీడియాను గమని స్తే టీవీ చానెల్స్‌లో వివిధ షోలను నిర్వహిస్తున్న వారందరూ తమ ను తామే ఇంటర్వ్యూ చేసుకొంటున్నారు. యాంకర్లు తమ అభిప్రాయాలు వ్యక్తం చేయడానికి తమ షోల అతిథిలను ఒక ఆలంబన చేసుకుంటున్నారు.
మనల్ని మనం ధర్మ పరులుగా పరిగణించుకోవడం ప్రారంభమై న వెంటనే వార్తా పత్రికల ద్వారా సమాజానికి, ప్రజలకు ఉపదేశా లు ఇవ్వటం ప్రారంభిస్తాం. అయితే జాతి సమస్యలను పరిష్కరించడంలో సరికొత్త దేవుడుగా మీడియా వైఫల్యంతో తీవ్ర విమర్శలు వెలువడడం అనివార్యం. నీరా రాడియా టేపులు వెల్లడయిన తరువాత ఇదే సంభవించింది.
అనేకమంది అనేక విధాలుగా పాత్రికేయులపై విమర్శలు చేశారు. జాతి మనస్సాక్షికి సంరక్షకులుగా పరిగణింపబడిన వారే ఇలా వ్యవహరించడం తమను దగా చేయడమేనని పలువురు వ్యాఖ్యానించారు. తమకు అపరిచితులైన అసంఖ్యా క ప్రజల తరఫున తాము మాట్లాడతున్నామని మీడియా భావిస్తుం టే , వివిధ అంశాలపై మీడియా జవాబుదారీగా వ్యవహరించాలని డిమాండ్ చేసే హక్కు తమకు ఉందని ఆ అజ్ఞాత ప్రజలు భావిస్తున్నారు.
మిత్రులతో, ఆప్తులతో తమ వ్యక్తిగత సంభాషణలు బహిర్గతమయినప్పుడు ఇబ్బందికి లోనుకాని వారెవరు ఉంటారు? సమాజంలోని వివిధ వర్గాలవారు తమ తమ విధుల నిర్వహణలో ఉత్కృష్ట ప్రమాణాలతో కూడిన జవాబుదారీ తనం వహించాలని మీడియా కోరుతున్నది. అలాగే మీడియా కూడా అవే కచ్చితమైన ప్రమాణాలకు కట్టుబడి ఉండాలని సమాజమూ గట్టిగా కోరుతున్నది.
ఒక విధంగా ఇదొక సానుకూల పరిణామమే. గత దశాబ్దంలో సంభవించిన మీడియా విప్లవంలో పాత్రికేయ వృత్తి ప్రమాణాలు పడిపోయాయనడంలో సందేహం లేదు. మీడియా సంస్థల మధ్య తీవ్ర పోటీ ఏర్పడడం వలనే ఈ పరిస్థితి ఏర్పడింది. రాజకీయవేత్త లు తమ ప్రత్యర్థులపై చేసే ఆరోపణలలోని నిజానిజాలను ధ్రువీకరించుకోకుండానే ప్రచురించడం లేదా ప్రసారం చేయడం జరుగుతోంది.
పరువునష్టం దావాల గురించి భయపడడం గతకాలపు విషయమైపోయింది. సంచలనాలను సృష్టించడమే లక్ష్యమైపోవడంతో మీడియా విశ్వసనీయతను కోల్పోతోంది. వ్యవస్థను గాఢ నిద్ర నుంచి మేల్కొల్పడానికి కొన్ని సందర్భాల లో మనకు మీడియా విచారణ అవసరమవుతుంది. అయితే మీడి యా విచారణదానికదే లక్ష్యమైతే మళ్ళీ మనం వృత్తి నిర్వహణలో చిత్తశుద్ధిని, విలువలను కోల్పోయే ప్రమాదముంది. అలాగే వార్తలు వ్యక్తిగత అభిప్రాయాలనే ప్రతిబింబించినప్పుడు కూడా అటువంటి ప్రమాదమేర్పడే అవకాశముంది.
ఈ కారణంగానే నీరా రాడియా టేపులు వెలుగులోకి వచ్చిన తరువాత మీడియాపై వెలువడిన విమర్శలు మన పద్దతులను మార్చుకునేలా ఒత్తిడికి లోనుచేశాయి. ఇది సరైన పరిణామమే. మీడియా ఒక మహాశక్తిగా ఆవిర్భవించడంతో మనం కొన్ని వాస్తవాలతో సంబంధాలను కోల్పోయాం. మనం మన వృత్తి పరమైన బాధ్యతలను కూడా మరచిపోయాం. స్వేచ్ఛాయుత పత్రికా వ్యవస్థ కు మనం సేవకులం. మన సొంత, కచ్చితంగా కార్పొరేట్ సంస్థల లేదా రాజకీయ వేత్తల ప్రయోజనాలను కాక ఆ వ్యవస్థ కర్తవ్యాలను నిర్వర్తించడానికి, లక్ష్యాలను నెరవేర్చడానికే మనం ఉన్నాం.
కొద్దిమంది పాత్రికేయుల నీతివిరుద్ధ ప్రవర్తన ఆధారంగా మీడి యా మొత్తాన్ని నిందించడం భావ్యం కాదు. వృత్తి విలువలకు నిబద్ధమైన వందలాది పాత్రికేయులు అత్యంత ప్రధాన భాగంగా ఉండే వ్యవస్థ మీడియా. మీకు ఎప్పటికప్పుడు వార్తలు అందజేయడంలో వారు ఎవరికీ భయపడకుండా, దేనిపట్లా పక్షపాతం చూపకుండా నిజాయితీగా వృత్తి ధర్మాన్ని నిర్వహిస్తున్నారు. 2010 సంవత్సరం లో మహా శక్తిమంతులను కూలదోసింది, పాత్రికేయ వృత్తి స్ఫూర్తిని సమున్నతం చేసిందీ కూడా వారే సుమా!
తాజా కలం: నీరా రాడియా టేపుల ఉదంతం తరువాత నిర్వహించిన ఒక సర్వేలో 97 శాతం మంది తాము జర్నలిస్టులను విశ్వసించమని చెప్పారు. మరో సర్వేలో విశ్వసనీయత విషయంలో రియల్ ఎస్టేట్ ఏజెంట్స్, రాజకీయవేత్తలకు పై స్థానంలో జర్నలిస్టు లు ఉన్నారు. ఈ విశ్వాసలోటును భర్తీచేసుకోవడమనేది 2011 సంవత్సరంలో జర్నలిస్టుల లక్ష్యం కావాలి.
(ఆంధ్రజ్యోతికి ప్రత్యేకం)
ఆంధ్రజ్యోతి సౌజన్యంతో
2 comments:
nijame mari media lo panichestunna reporterlu, anchorlu taame samaajaanni nadipistunnattu. . . taamu cheppinde vedam annattu. . . vaalla manasullo anukune abhipraayaalanu prajalavigaa ruddutunte. . .
edo oka roju paadu politics antoo raajakeeya naayakulni, raajakeeyaalni elagaite cheedarinchukuntunnaaro. . .
antakante media pratinidhulani, media ni cheetkarinchukuntaaru.
tarimi tarimi kodataaru.
aa paristhithulu thalethakundaa. . . media managementlu, media lo panichestunna sadaru samajoddarakulu ikanainaa melukunte manchidi.
Who owns Indian media outlets.
http://hindulinebengal.wordpress.com/2010/11/16/how-the-subversive-media-in-india-goes-against-%E2%80%9Cindia-and-her-people%E2%80%9D/
Post a Comment