Thursday, May 6, 2010

నా వెన్నెల

వెన్నెల. . .
చల్లని హాయినే కాదు. . .
వెచ్చటి బాధను కూడా ఇస్తుంది.

మనసు హాయిగా ఉన్నప్పుడు వెన్నెల ఎంతో అందంగా, అపురూపంగా, ప్రేమగా, హాయిగా. . .
అంతెందుకు ప్రపంచం మొత్తం అందంగా ఉన్నట్టే కనిపిస్తుంది.
కానీ, జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు అదే వెన్నెల కాంతులు వేడిగా, భరించలేనివిగా. . . ఉంటాయి.

ఏదేమైనా వెన్నెలను ఆస్వాదించడం వ్యక్తి పరిస్థితిన బట్టి. . .
జీవితం సాగే ప్రయాణం దిశను బట్టి ఉంటుంది.

జీవితంలో ఏ కాస్తా ఒడిదుడుకులు ఎదురైనా . . . వెన్నెల విరజిమ్మే అందాలను ఎవ్వరూ ఆస్వాదించలేరనేది నా వాదన.

బాల్యంలో అమ్మా చందమామ ఎప్పుడొస్తాడు అన్న నా ప్రశ్నకు అమ్మ చెప్పిన సమాధానం ఇప్పటికీ గుర్తే. . . రోజూ రాత్రి కాగానే వస్తాడమ్మా అంటూ. . . కానీ రాత్రి కాగానే మళ్లీ అడిగే దాన్ని. . . అమ్మా చందమామ ఇంకా రాలేదేం అని అడిగేదాన్ని.
అమ్మకి నేనడిగిన చందమామ విషయం అర్ధంకాక ఇదేనాన్నా చందమామ అని చెప్పి నాకు ఏదో రకంగా సర్దిచెప్పేది.
ఇది బాల్యంలో జరిగిన విషయం. . .
కాస్త ఊహ తెలిసాక నేను అడిగిన ప్రశ్న నాకే వింతగా అనిపించింది. ఎందుకంటే ఊహతెలియనప్పుడు నేను అడిగిన చందమామ నా దృష్టిలో వెన్నెల.
అప్పటినుంచే నాకు వెన్నెల అంటే అంత ఇష్టం. ఎందుకంటే వెన్నెల్లో గుజ్జనగూళ్లను కట్టుకునేదాన్ని పెరట్లో ఉన్న ఇసుకతో. . .
ఆరు బయట మంచం వేసుకున్నప్పుడు పళ్లెంలో కనిపించిన అన్నం ఇంకా తెల్లగా కనిపించేది. తెల్లగా. . . స్వచ్ఛంగా ఉన్న ఆ అన్నంలో అమ్మ చేతివేళ్లు కూరను కలుపుతుంటే. . . నాకు కమ్మనైన సంగీతం వింటున్నట్టు ఉండేది.
అప్పట్లో కలిగిన నా ఫీలింగ్‌కి ఇప్పటి నా అక్షర రూపం. . .
అమ్మ ఒళ్లో కూర్చుని అన్నయ్యతో కబుర్లు చెప్తూ. . . నాన్న చెప్పే కబుర్లు వింటూ ఆనందంగా ఉన్న ఆ వెన్నెల రోజులు నిజంగానే ఎంతో పొందికగా దాచుకోవాల్సిన వెన్నెల రాత్రులు.
వాటిని ఇప్పుడు అక్షరాల్లో పెట్టాలనే నా ప్రయత్నం నా తెలివి తక్కువతనమే అవుతుంది.
కానీ ఆ భావన పొందుపరుచుకోవాలంటే మనసుకి మధురమైన ఆ గుర్తులను మరొక్కసారి జ్ఞప్తికి తేవాలంటే ఇంతకంటే మరో మార్గం కనిపించడంలేదు మరి.
అందుకే వేసవిలో మండే ఎండలున్నా. . . పూర్ణంగా ఆకాశంలో కనిపించే చందమామను చూడగానే. . . ఆ వెన్నెల రాత్రులు గుర్తుకొచ్చాయి.
ఆహా. . . తలుచుకోవడానికే ఆ రోజులు.
ఇప్పుడు నేను వెన్నెల్ని వెతుక్కోవాలంటే ఆకాశాన్ని మించి దాటిపోతున్న భవనాలను అధిరోహించాలి.
కనీసం అప్పుడైనా వెన్నెల్ని చూడగలననే నమ్మకం అయితే నాకు లేదు. కారణం కాలుష్యపు మేఘాలు కమ్ముకుంటాయి కదా. . .
ఏం లాభం?
అందుకే ఎప్పటిరోజుల్ని అప్పుడే ఎంజాయ్‌ చేయాలి. ప్రత్యేకించి ఇటువంటి మధురమైన అనుభూతులు . . . తిరిగి వస్తాయనుకోవడం వెర్రితనమే అవుతుంది. ఎందుకంటే దోసిళ్లో పట్టుకున్న నీళ్లలాంటిదే వీటి పరిస్థితి.
బహుశా ఇప్పుడు వెన్నెల్ని కూడా ఆర్టిఫిషియల్‌గా పట్టిస్తారేమో. కానీ చల్లని వెన్నెల వర్షం తాలూకు అనుభూతిని రప్పివ్వగలరా?
అది కృత్రిమంగా వస్తుందా?
అందమైన వెన్నెల మళ్లీ ఎప్పుడు కనిపిస్తావు? అని అడగడం తప్ప. . .
కనీసం పల్లెలోకి వెళ్లాలన్నా . . . అక్కడ వెన్నెల కనిపించినా . . . మనసు ఆహ్లాదించలేదు. . .
ఎందుకంటే పట్నం పిలుస్తుంటుంది. పొట్టకూటికోసం చేసే ఉద్యోగ బాధ్యతలు పిలుస్తాయి. ఇంకా ధైర్యం చేసి వెన్నెల రాత్రిని ఆస్వాదిద్దామంటే. . . నెలజీతంలో పడే కోత గుర్తుకొస్తుంది.
మరి వెన్నెలని ఆస్వాదించలేమంటూ మనల్ని మనం తిట్టుకుంటే సరిపోతుందా? లేకపోతే పట్టణాలకు పరుగెట్టి మానసికంగా అలసిపోయి. . . జీవితాన్ని మన చేతులనుంచి జార్చుకున్న మన దైన్యాన్ని తిట్టుకోవాలా?
వెన్నెలా. . . వెన్నెలా . . . నిన్ను ఆస్వాదించలేకపోతున్నందుకు నా మనసుకు నేనే శిక్షవేసుకుంటాను. దయచేసి వెన్నెల చల్లటి కాంతులను. . . వెచ్చటి ఆవిర్లుగా మార్చకు.

కసబ్ కి శిక్ష పడింది

కసబ్ కి శిక్ష పడింది. . .
మరణ శిక్ష ఇటువంటి ఉగ్రవాదానికి పరిష్కారమా?
ఇలా ఎంత మందిని చంపుకుంటూ పొతే ఉగ్రవాదం అంతమవుతుంది?
ఉగ్రవాదాన్ని అంతరించే అస్త్రం ఉంటె బాగుండు . . .
ఒక్క మనదేసంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఇదే పరిస్థితి
ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన దేశమే ఆ ఉగ్రవాదం బారిన పది ఇబ్బంది పడుతోంది. . .
అసలు పక్కవాడిని ఏదో చేయాలనే ఆలోచనే ఈ సమస్యకు ప్రధాన కారణంగా ఉంటోంది.
కసబ్ విషయానికి వస్తే . . . శిక్ష వేయడం వరకు ఓకే. . . కానీ ఆ శిక్షను ఎప్పుడు అమలు పరుస్తారు . . .
ఈలోపు సదరు మానవ హక్కుల సంఘాలు గోల చేయకపోతే నయమే.

మానవహక్కుల వాళ్ళు ఈ మధ్య అవసరమైన వాటికి కాకుండా. కీలకమైన, గట్టిగ ఉండాల్సిన విషయాల్లో కూడా అలా చేసారు ఇలా చేయొద్దు అంటూ. . . తెగ గోల చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం?

నార్కో అనాలిసిస్ వంటి పరీక్షలను కూడా కోర్ట్ వద్దనడం నేరాలు ఎక్కువగా చేయడానికి ఉపయోగపడేది లాగానే ఉంది.
పాపం వైష్ణవి కేసు కి కూడా ఈ పరీక్షలను రద్దు చేయడం. . . పెద్ద అవరోధంలాగా మారింది.
ఏదేమైనా. . . చట్టం, సమాజం, భయం, మరీ ముఖ్యమగా మనుషులంటే గౌరవం లాంటివి లేకుండా పోతున్నాయి.
ఎవరి ఎదుగుదలను ఎవరూ భరించలేకపోతున్నారు.
ఉన్నోడికే డబ్బులు. . . లేనోడు లేనట్టే ఉంటున్నాడు.
దాంతో ఉగ్రవాదం, తీవ్రవాదం పెరిగిపోక ఏమి చేస్తాయి. . . ?
పరిస్థితి ఇలానే ఉంటుంది.
ముందు భవిష్యత్ ని ఊహించుకుంటేనే భయంకరమగా ఉంది.
నవసమాజం అంటే ఇదేనా. . .

Monday, May 3, 2010

కసబ్ శిక్ష - తెలుగు టివి సీరియల్. . .

జీడి పాకం లాగా సాగే తెలుగు టివి సీరియల్ లాగా. . . . కసబ్ శిక్ష విషయం కూడా ఉంది.
భలే చిరాకు పుట్టిస్తోంది. . .
ముప్పై ఏడు కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందా. . .
అంత ఘోరం. . . అందరి కళ్ళ ముందుసాక్ష్యంగా ఉంటే. . . విచారణ పేరుతో ఇన్నాళ్ళు మేపడమే కాకుండా. . . ఇప్పుడు శిక్షను చెప్పడం విషయంలో కూడా ఉదయం నుంచి పాకం లాగానే అనిపించింది. . . ఇది బహుశా ఆ దుర్మార్గుడు చేసిన మారణ కాండకు కావొచ్చు.
ప్రజల మధ్య నిల్చో పెడితే శుభ్రంగా వాడి భరతం పట్టే వాళ్ళు.
దోషిగా నిర్ధారించారు. . . మరణ శిక్ష వేసినా కూడా ఒక్కసారిగా కాకుండా. . . రోజుకో విధంగా హింసించాలి.

Saturday, April 24, 2010

చిన్నప్పుడు ఎప్పుడో వచ్చిన ఐడియా ఇది . .

చిన్నప్పుడు ఒక ఆదివారం రోజు వచ్చింది ఈ ఆలోచన. . .
ఆ ఆలోచన మొన్న చాలా స్ట్రాంగ్ గా అనిపించింది.
ఆ గొప్ప ఆలోచన ఏమిటంటే . . .
మనం వెళ్ళే రోడ్ అంతటా టాప్ వేస్తె ఎలా ఉంటుంది అని. . .
అలా ఒక రూఫ్ లాగా వేసుకుంటే ఎండా నుంచి, వాన నుంచి, తప్పించుకోవచ్చు. అప్పుడు ఎండా కాలంలో స్కార్ఫ్ లు, వానా కాలంలో రెయిన్ కోట్ లు అవసరం లేకుండా ఉంటుంది కదా.
ఇలాంటిదే మరో ఆలోచన ఏమిటంటే ఇంట్లో ఎసి కి బదులుగా మనం వేసుకునే డ్రెస్ లే ఎండాకాలంలో చల్లగా. . . చలికాలంలో వెచ్చగా ఉండేవి మార్కెట్ లోకి వస్తే ఎంత బాగుంటుందో కదా. . .
ఈ రెండు ఆలోచనలే కాదు ఇలాంటివే బోలెడు వస్తుంటాయి.
మీ బుర్రల్లో కూడా ఇటువంటి ఆలోచనలు ఏమైనా ఉంటె. . . పంచుకోండి. . .
సరదాగా ఉంటుంది కదా.

Tuesday, April 20, 2010

ఎన్ని ఆటలో. . . చిన్ని గుండెలో

చిన్నప్పుడు ఆడుకున్న ఆటలన్నీ గుర్తుకొచ్చాయి మొన్న ఒక సందర్భంలో . . .
ఆఫీసు లో అందరం కలిసి కూర్చుని మాట్లాడుకుంటుంటే. . . ఒక సారి మధురమైన బాల్య జ్ఞాపకాలలోకి వెళ్లి వచ్చేసాము.
ముఖ్యంగా చిన్నప్పటి ఆటలు. . .
కోతి కొమ్మచ్చి, ఇసుకలో పుల్ల దాచి పెట్టి దాన్ని రెండు చేతులతో మూసి (పేరు గుర్తులేదు) ఎదురుగా ఉన్న వాళ్ళని ఆ పుల్ల ఎక్కడ దాచామో చెప్పమని అడగడం. . , చెమ్మ చెక్కలాట, అచ్చెన గిల్లలు, వామన గుంటలు, బతకమ్మ ఆట, వంగుడు దూకుళ్ళు, చింత పిక్కల ఆట, ఎండా వాన, దొంగ పోలీసు, మా తాత ఉత్తరం ఎక్కడో పోయింది అంటూ. . ., గద్దొచ్చే కోడి పిల్ల. . . అంటూ ఇంకో ఆట, నాలుగు స్తంభాలాట, టేక్కలే (దొంగ అయిన వాళ్ళు అంటుకోకుండా కింద కూర్చుండి పోవాలి ), కుంటుడు, బొమ్మలాట, పచ్చీస్, అష్ట చెమ్మ, . . . ఇలా ఇంకా ప్రస్తుతానికి గుర్తుకి రాని ఎన్నో ఆటలు ఆదేవాల్లము, అవి గుర్తుకి వచ్చినప్పుడు మనసుకి ఎంతో హాయినిచ్చినా. . . ఇప్పటి పిల్లలకి ఇవన్నీ లేవు కదా అని ఒకింత బాధగా కూడా అనిపించింది. . .
ఎందుకంటే అవి ఆడేటప్పుడు ఉండే మజానే వేరు కదా. . .

Sunday, April 18, 2010

గుబ్బకాయలు

గుబ్బ కాయలు . . . వీటినే సీమ చింతకాయలు అని కూడా అంటారు.
చిన్నప్పటి జ్ఞాపకంగా మిగిలిపోకుండా ఉండేదుకు. . . రోడ్ మీద తోపుడు బండ్లలో పెట్టి అమ్ముతున్నారు బాగానే ఉంది. సంతోషంగా అనిపించింది కూడా. . .
గుబ్బకాయలతో పాటుగా చింత చిగురు కూడా కుప్పపోసి పెట్టారు. . .
అది చూసి ఆహా ఇవ్వాళ రోడ్ చూసేందుకు ఎంత బాగుందో అనుకున్నాను మనసులో. . .
అంతటితో ఆగిపోతే అది మనసని ఎందుకు అనిపించుకుంటుంది. . .
గుబ్బ కాయలు తినాలనిపించింది . . . వెంటనే ఒక పక్కన ఆగి ఆ తోపుడు బడని దగ్గరకు వెళ్లి. . . గుబ్బకాయలను చూపిస్తూ ఎంత బాబూ అన్నాను. అతను చెప్పిన రేట్ విన్నాక. . . హా అని నోరు తెరుచుకుని ఉండిపోయాను కాసేపు.
ఆ తరువాత తేరుకుని . . .
బలంగా వాటిని తినాలన్నా కోరికని నొక్కి పెట్టాలనుకున్నాను. . . ఎందుకంటే అతను పావు కిలో ౪౫ (నలభై ఐదు ) రూపాయలు అనగానే. . . సెకండ్ లో ఒకటో వంతు గుండె ఆగిపోయింది కాబట్టి. . .
ఆ సెకండ్ లోనే చిన్నప్పుడు ఆడుకుంటూ గుబ్బకాయల్ని ఏరుకుని తిన్నానని. అలా తిని. . . మిగతావి గాల్లోకి విసురుతూ. . . పక్క వాళ్ళ పై విసురుతూ తిరిగిన రోజులు గుర్తుకొచ్చాయి. . . అచ్చం సునామీలాగా చుట్టుముట్టాయి ఆ జ్ఞాపకాలు.
కానీ ఏమి చేస్తాం పొట్ట చేత్తో పట్టుకుని పట్టణానికి వచ్చాం కదా నలభై ఐదు ఏమి ఖర్మ. . . ఎనభై ఐదు అన్నా కొనుక్కోవాలి తినాలి తప్పదు. అది కూడా వాటి రుచి తెలుసు కాబట్టి ఆ కోరిక. . .
అదే సిటీలలోనే పుట్టిన పిల్లలకి ఐతే ఆ బాదే లేదు. . .
ఎందుకంటే వాటిని కొనాల్సిన అవసరమే లేదు. . .
కాస్తో కూస్తో పల్లె టచ్ ఉంటే తప్ప వాటి పేరు కూడా తెలియదు కాబట్టి.
కొనాల్సిన అవసరం రాదు. . . ఆ రేట్ చూసి గుండె దడా రాదు.
చివరకి కొన్నాను. బేరమాడి ఇరవై ఐదు రూపాయలకి కొన్నాను. ఆ పక్కనే ఇంకో కుప్ప చింత చిగురు కనిపించింది కాని. . . దాని రేటు అడిగితె చటాకు తొంభై అంటాడేమో అని.
మనసుని, నోటిని రెండిటిని కట్టుకుని వచ్చాను.
ఇదీ ఇవ్వాల్టి గుబ్బకాయ అదేనండీ సీమ చింతకాయ తెచ్చిన చింత.

Thursday, April 1, 2010

వచ్చేసింది

హలో
తెలుగులో టైపింగ్ వచ్చేస్తోంది. కృతజ్ఞతలు.
ఇప్పుడు తెలుగులో రాయండి అని తిట్టే వాళ్ళ నెంబర్ తగ్గుతుందోచ్.

గుబ్బకాయ

గుబ్బకాయ
ఇవి చాలా ఖరీదు గురూ. . .

వామన గుంటలు

వామన గుంటలు
ఇందులో గవ్వలు పెట్టారు కానీ మేమయితే చింతగింజలతో ఆడేవాళ్లం